Thursday, November 29, 2007

నగ్నంగా మాట్లాడటం నా హాబి...

నగ్నంగా మాట్లాడటం నా హాబి
అగ్నితో ముద్దాడటం నా కిష్టం

ఒంటరి గదిలో చిక్కటి చీకటిలో
కిటికీలకు కిటుకులు
నేర్పడం మరింత ఇష్టం!


పుస్తకాలలో వాటిలోని అక్షరాలలో
అణువణువులో ఆనందం వెతుక్కుంటూ
వెర్రిగా కేరింతలు వేయడం
నా కిష్టం!


ఎవరూ లేని రహదారిపై
అడుగులో అడుగువేస్తూ
మైలురాళ్ళను లెక్కపెట్టడం
నా కిష్టం!


కఠిన శిలలలో కారుణ్యపు
కాంతిరేఖలు చూడడం
మనిషిలో మానవత్వాన్ని
ప్రేమను,ప్రేమించే తత్వాన్ని
మానవులలో,మట్టిలో
నాటటం నా కిష్టం!


ఆకాశానికి భూమికి నిచ్చెన వేసి
వాటికి మూడు ముళ్ళు వేయించడం
మేఘాల మెడలు వంచి
వాటి గర్వాన్ని తగ్గించడం
రైతుల ఆత్మహత్యలు లేని పేపరు
చదవడం నా కిష్టం


కాలుష్యపు సాహిత్యంలో
మలయమారుతపు కవిత్వాన్ని
ఊదటం నా కిష్టం కాదు
నా ప్రాణం!