Tuesday, January 22, 2008

తెలంగాణ సామాజిక సమస్యల చిత్రణ-ఎల్లమ్మ ఇతర కథలు

తెలంగాణ సామాజిక సమస్యల చిత్రణ-ఎల్లమ్మ ఇతర కథలు



పదేళ్ళ కాలంగా తెలంగాణ కథ విస్తరిస్తోంది.బహుముఖమైన జీవితాన్ని చిత్రిస్తోంది. తెలంగాణ ప్రజల జీవితమంతా ఒకే తీరున లేదు.ఎంతో వైవిద్యం ఉంది. 1990 కాలంలో ఆరంభమైన సరళీకృత ఆర్థిక విధనాలు ప్రభావం తెలంగాణాపై అధికంగా ఉంది.పట్టణాలకి,పల్లెలకి మద్యన అంతరాలు పెరిగాయి. ప్రపంచీకరణ ప్రభావాల పర్యావసానంగా ఏర్పడిన పరిణామాల చిత్రీకరణను చాలమంది కథకులు చిత్రించారు.పల్లె జీవితాల్లో వస్తున్న మర్పుల్ని తెలంగాణకి చెందిన వివిధ జిల్లల కథకులు చిత్రించారు.పల్లె జీవితం మునుపు ఉన్నట్టుగా లేదు.పల్లెల్లోకి డిష్ యాంటెన్నాలు వచ్చాయి.కూల్ డ్రింక్స్ ,వాటర్ బాటిల్స్ ఒక్కమాటలో చెప్పలంటే మార్కేట్ నిర్దేషించే సమస్త వస్తు సముదాయం పల్లెల్లో దొరుకుతుంది.ముఖ్యంగా కేబుల్ టీవి వచ్చి తెలంగాణ పల్లెల జీవితాన్ని ఎంతగా చిద్రం చేసిందో ఇప్పటి కథకులు చిత్రించారు.
తెలంగాణ ఆత్మను పట్టుకొన్నవారిలో కాసుల ప్రతాపరెడ్డి ఒకరు.ఈయన కథల సంపుటి "ఎల్లమ్మ ఇతర కథలు" చదివితే ఈ విషయం తెలుస్తుంది. ఒకే వ్యక్తి కథకుడిగా,కవిగా, విమర్శకుడిగా,జర్నలిస్టుగా తెలుగు సాహిత్యంలో రాణించడం అరుదైన విషయం.తెలంగాణ,కోస్తా భాషల వైరుధ్యాల్ని ఈ రచయిత చక్కగా ఆవిష్కరించారు. "ఎల్లమ్మ ఇతర కథలు" సంపుటిలో మొత్తం పదియేను కథలు ఉన్నాయి. వస్తువు రీత్యా ప్రతి కథ విభిన్నంగా ఉండి చదివించే శైలిలో ఉండడం గొప్ప విషయం.రచయిత కథ శిల్పం మనలను అనవసర వర్ణనల జోలికి పోకుండా ఏకంగా కథలోకి దిగుతాడు.కథకు సరిపడని వ్యర్తమైన పదం ఒక్కటి కూడ వాడకపోవడం రచయిత అక్షరాల పొదుపరి తనాన్ని చూచిస్తుంది.శైలి సులభంగా ఉండి ఎక్కడ ఇబ్బంది కలిగించదు. ప్రస్తుత తరంలో కాసుల ప్రతాప రెడ్డి అగ్రశ్రేణి కథ రచయిత అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.
సంపుటి లోని మొదటి కథ "శిథిలం" రైతుల ఆత్మహత్యల పరంపరను సహజంగా చిత్రించింది.తెలంగాణలో వ్యవసాయం ఎంత దారుణంగా తయారయిందో వివరిస్తాడు. కథలోని పాత్రతో ఇలా అనిపిస్తాడు "ఏంది నాయన!మా రైతులమంతా చచ్చిపోయినంక ఈ దేశం ఎట్లా వుంటుందంటావు? నోట్లు ముద్రించుకొని వాటిని నమిలి మింగుతార?ఇదిగో చూడు! ఈ రోడ్డు వేసిండ్రు.దీన్ని రొట్టె ముక్కల లెక్క కొరుక్కొని తింటామా?" అని రైతు అనడంలో ఎంతో తాత్వికత కనిపిస్తుంది.ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికి జరుగుతున్నాయి. పల్లెలు,వ్యవసాయం కనుమరుగవుతున్న దృశ్యాన్ని రచయిత శక్తిమంతంగా ఈ కథలో "ఫోటోగ్రాపిక్" గా చిత్రించాడు.
మాల,మాదిగల మద్య తేడాలు ఉన్నట్లే రెడ్లలో గల తేడాలను "పక్షులెరిగి పొయిన తోట" కథలో రచయిత మనకు తెలియజేస్తాడు. ఇది చదివి మనం విబ్రాంతి పొందుతాము రచయిత మాటల్లో చెప్పాలంటే "మాల మాదిగలను మా ఇళ్ళలోకి రానీయకపోవడం అనుభవంలోనిదే.కానీ కలిసి ఉంటూ కూడ ఇంత తేడా పాటించాలా? మేటాటి రెడ్లు,మేం పాకనాటి,మేనత్తవాళ్ళు గూడాటి రెడ్లు,రెడ్లలో ఎనిమిది రకాల రెడ్లు ఉన్నారు. వీరిమద్య కూడా అంటరానితనమేదో వున్నట్లు నాకనిపిస్తుంది" అంటూ రెడ్ల లో గల అంటరానితనాన్ని మనముందు వుంచుతాడు.
మరో మంచి కథ "బతుకు చిద్రం" ఇందులో రాజయ్య వరుసగా కురుస్తున్న వర్షానికి పొట్టగడవదు. అతని ఆటో రిక్షా నాలుగు రోజులుగా మూలన పడిఉంటుంది.తినడానికి తిండి ఉండదు.వర్షంలో ఎలాగైతేనేం బయటకు వస్తాడు కాని ఒక గిరాకి వచ్చే సూచనలు కూడ కనిపించడం లేదు.ఒక పక్క ఆకలిగా ఉంటుంది.బస్టాప్ కు చేరుకుంటాడు ఒకరిద్దరు వచ్చిన హళ్ళు హడవిడిగా ఆటో వంక చూడకుండానే వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలిస్ రోడ్డుకు అడ్డంగా ఆటో ఆపాడని లంచం అడుగుతాడు. అసలే నాలుగు రోజులుగా అన్నం మొహం చూడని రాజయ్య అతని మాటలకి కోపం వచ్చి ఆటో దహనం చేస్తాడు. ఇందులో సామన్యుని ఎదిరింపు,తెగింపు చూడవచ్చు.నిజానికి ఆటో దహనం చేయలన్నా కోరిక ఈ వ్యవస్థ మీద తిరుగుబాటుగా కనిపిస్తుంది.

"ఆప్టర్ ట్వంటి ఇయర్స్ అను మంచి మిత్రుల కథ" ఇద్దరు మిత్రులకు సంబదించిన కథ.శేఖర్ ఒక పోలిస్ ఆపిసర్ అతని మిత్రుడు ఒక జర్నలిస్ట్.శేఖర్ ను చూసి అనవసరంగా బయపడుతుంటాడు జర్నలిస్ట్ మిత్రుడు.ఈ కథ కొంత వరకు జర్నలిస్ట్ మిత్రుని మానసిక భయాలను తెలియచేస్తుంది.
రాములు ఒక యూనివర్సిటీలో డిపాట్మెంట్ హెడ్.ఇతనికి రమాదేవితో పరిచయం అవుతుంది.అప్పటి వరకు మంచి వాడిగా పేరున్న రాములు రమదేవి పరిచయం వల్ల వారికి కావలసిన వరికి ఉదారంగా ఫండ్స్ మంజూరు చేసి ఉద్యోగం పోగొట్టుకుంటాడు.అక్రమ సంబందాలు ఎంతటి విపత్కర పరిస్థిలకు దారితీస్తాయో "దగ్దం" కథ ద్వార తెలుసుకోవచ్చు.

కార్పోరేట్ కాలేజ్ ల హింసను,ర్యాంకుల పేరిట జరిగే ఒత్తడిని భరించలేక ఆత్మహత్య చేసుకొన్న ఇంటర్మీడియట్ విద్యార్థి కథను "హత్య" లో చదవవచ్చు.తల్లిదండ్రులు కేవలం ర్యాంకుల గురించి విపరీతమైన వత్తిడి తేవడం వలన, కొత్త ప్రదేశంలో చదవడం వలన,పిల్లలను కేవలం ర్యాంకులకే పరిమితం చేయడం వలన ఈ ఆత్మహత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

విద్యార్తి దశ నుండి కలిసి తిరిగిన విహహబంధం పవిత్రతను ప్రశాంత్ అర్థం చేసుకోలేకపోయాడు.అసూయతో అతడు తనలో తనే మథనపడటం వంటి సన్నివేశాలు "పెనుగులాట"కథలో చదవవచ్చు.పద్మజ లాంటి గృహిణులు కూడ బయట ఎన్ని బాధ్యతలు వున్న కుటుంబ వ్యవస్థను విస్మరించకూడదనే సత్యాన్ని చక్కగా చెప్పారు రచయిత.

ప్రేమికురాలి మితిమీరిన ఒత్తిడిని నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చి,భార్య దగ్గరకే వెళ్ళిపోయే కథానాయకుడిని ఎంతో సానుకూలంగా చిత్రించిన కథ "లవ్ 2020".

మానవ సంబంధాల్లో వుండాల్సిన గాఢతని వ్యక్తీకరించిన కథ "కొన్ని ప్రేమలు".నిరంతర తపనకి సంబధించిన వ్యవహరం ప్రేమ అని,బాద్యతను మోయడానికి కుదుర్చుకునే ఒప్పందం పెళ్ళి అని అనడం ద్వార రచయిత పెళ్ళి బోలుతనాన్ని చాటుతాడు.
సమాజంలో తరతరలుగా పాతుకుపోయిన మూడనమ్మకాలని గురించిన కథ "ఎల్లమ్మ"పెట్టుబడిదారి సమాజంలో పాత ప్యూడల్ సంబంధాలు ఇంకా మిగిలి ఉండటం వల్ల ఎంతో మంది ఈ మూడనమ్మకాలకు బలైపోవడం ఈనాటి సామాజిక దృశ్యం.బాలమ్మ తన చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం వల్ల ఏర్పడిన అభద్రతలోంచి,లైంగిక వాంచలు తీరని ఒకనొక మానసిక అసమత్యుల స్థితిలోకి వెళ్ళింది.అది ఎల్లమ్మ పూనకంగా తాను భ్రాంతి చెందింది.సమాజంలో వున్న మూడవిశ్వాసాలు ఇంకా ఈనాటి గ్రామీణ ప్రజల నిత్య అనుభవం లోనిదే.

No comments: