Thursday, September 13, 2007

నాన్న...

నాన్న...
నిన్ను చూడాలని ఉంది
నీ రూపం రెప్పలపాటు
స్వప్నంలో కన్నీటి బిందువులు
అయ్యాయి!


నాన్న నువ్వొక
సముద్ర గర్బానివి
అప్పుడె ఉదయించిన
సూర్యునివి!


అమ్మలేని లోటును
సమర్థంగా పోషించి
తల్లిప్రేమను తలపు లోకి
రాకుండ చేశావు!


అమ్మలా వండావు
కుదురుగ తల దువ్వావు
ప్రేమగా నుదిటిపై
ముద్దెట్టావు!


ఈ లోకంలో
పడినప్పటి నుండి
అమ్మ రూపం ఎలా
ఉంటుందో నాకు తెలియదు!


అమ్మ లేని లోటును
ఎప్పుడు గుర్తుకు రానంత
గారాబంగ పెంచావు!



వడిలో కూర్చోబెట్టుకొని
చందమామ కథలు
చందంగా చెప్పావు
అన్నంలో ముద్దపప్పు కలిపి
ముద్దలు ముద్దలుగా
ముద్దుగా తినిపించావు!


నాన్న నీవు
నా చిన్ననాటి స్నేహితుడివి
నిరంతరం నా వెన్నంటి ఉండే
మాటల సవ్వడివి!


నీవు లేవు అని
గుర్తొచ్చినప్పుడు
ఏడుపు వరదల పొంగుకొచ్చి
శరీరాన్ని ముంచేస్తుంది!



ఆకాశం వంకా
చూసినప్పుడల్లా
మేఘాల గుంపులో
నీ అస్పస్ట రూపం
నేనున్ననంటూ
భరోసా ఇస్తుంది!



నీ రూపం కాల గర్బంలో
కలిసిపోయిన
నీవు నింపిన స్పూర్తి మాత్రం
నిరంతరం నన్ను
చోధక శక్తిలా నడిపిస్తూనే
ఉంటుంది!



(నా ప్రియమైన నాన్నకు అశ్రునయనాలతో అందిస్తున్న అక్షర సుమాలు ...)

No comments: