Friday, March 23, 2007

బాగా గురుతు...

బాగా గురుతు.
అయితారం అంగట్ల
నువు కొనిచ్చిన సీకులు,
సాహేబు దుక్నంల పిప్పరమెంట్లు తినుకుంట
గడిలోకెళ్ళి మనమొస్తుంటే,
మంగళి నారాయణ, మాదిగ లచ్చయ్య
ఒరేయ్ ‘ఎంకటేషు’ అని పిలిస్తే
ఎగిరి గంతేసి ఉరికెటోన్ని.
జొన్న కంకుల్ని బెల్లంల కలిపి
ఆగమాగం మెక్కెటోన్ని.
పీర్ల పండుగ నాడు మైదాకు బెట్టుకోని
మునిమాపు యేళ అళయ్ బళయ్‌గా
మస్తుగ తిరిగెటోన్ని.

ఇయ్యాళ
పెద్ద సదువులు సదివి మళ్ళ ఊరికి పోతె
ఎక్కడ జూశినా టీవీలు
వాటి ముందు మందలు మందలుగా జనం.
నేను పుట్టి పెరిగిన పల్లె
నాకే అన్‌జాన్ గొడుతున్నది.

మంగళి నారాయణ, మాదిగ లచ్చయ్య
‘ఎంకటేషు’ అని పిలవలేదు.
ఎండిపోయిన లంక చేనులా
ఎవరి మొగంలా కళ లేదు.

ఏమైంది నా ఊరికి?
ఎక్కడ పోయినయ్ అప్పటి ప్రేమలు.
నాకు మునుపటి నా ఊరు కావాలె.
గిదేదో మొగాలకు రంగులేసుకున్న
బాగోతంలా కనబడుతున్నది.
ఏం పెద్ద రోగమొచ్చిందో ఏమో!
ఎవడి దిష్టి తగిలిందో ఏమో!

అమ్మా!
అయితారం అంగట్ల సీకులు
సాహేబు దుక్నంల పిప్పరమెంట్లు మళ్ళ తినాలనుంది.
మళ్ళ చిన్నతనంలోకెళ్ళి
పులికాట్ ఆట ఆడాలనుంది.
గా దినాలు యిగ రావా అమ్మా!!

No comments: