Wednesday, March 17, 2010


బాల రసాల...
బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమైఏవిటి, ఇది పోతన పద్యంలా అనిపిస్తోంది కాని కాదు అని ఆలోచిస్తున్నారా? అవును ఇది పోతన పద్యం కాదు. ఇది మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం. ఈ మంచన కవి క్రీ.శ. 1300 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పోతనకన్నా ముందరివాడు. ఇక్కడ "కూళలు" అంటే క్రూరుడు, మూఢుడు అనే అర్థం. అటువంటి వారికి సుకుమారమైన కావ్య కన్యకని ఇచ్చి ఆ పడుపుకూడు తినడం కన్నా పొట్టపోసుకోడానికి కవులు హాలికులగా మారి పొలం దున్నుకోడం మంచిది. అదికూడా లేదూ అంటే "కౌద్దాలికులు" అయినా పరవాలేదు అని దీని భావం. "కుద్దాలము" అంటే ఒక రకమైన గడ్డపార. కౌద్దాలికులంటే గడ్డపార పట్టుకొని కందమూలాలు తవ్వి తీసుకొని తినేవాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి మంచన తన కేయూరబాహు చరిత్రని నండూరి గుండనమంత్రికి అంకితం ఇచ్చాడు. అంచేత ఇక్కడ అతని ఉద్దేశం కావ్యాన్ని కూళలకి అంకితమివ్వకూడనే కాని నరులెవ్వరికీ అంకితమివ్వకూడదని కాదు.మనకి చాటుపద్యాల సంప్రదాయం ఉండేది. సామాన్య ప్రజల నాలుకల మీదగా చాటువులు ప్రచారం పొందేవి. చాలాసార్లు అసలు వీటిని రాసినదెవరో కూడా తెలియదు. కొన్ని చాటువులు కొందరు కవుల పేర్ల మీద చెలామణీ అవుతూ ఉండేవి. కొన్ని కావ్యాలలోని పద్యాలు కూడా ఇలా చాటువులుగా మారిన సందర్భాలున్నాయి. అదిగో అలా మారిన ఒక చాటువు యీ పద్యం. ఈ చాటువులు మార్పులు చెందుతూ ఉండడం కూడా సాధారణంగా జరిగేదే. అలా కొన్ని మార్పులు చెంది తర్వాత కాలంలో ప్రసిద్ధి పొందిన పద్యం ఇది:బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమైఈ మార్పులు పద్యానికి మరింత అందాన్నిచ్చాయి. "బాలరసాలపుష్ప" అనడం కన్నా "బాలరసాలసాల" అనడం సొగసుగా లేదూ! "సాలము" అంటే చెట్టు. లేతమావిడి చెట్టుకి పూసిన కొత్తచిగురంత కోమలమైన కావ్య కన్యక అని అర్థం. అలాగే "గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులు" అనడంలో పద్యానికి బిగువు వచ్చింది. "గహనము" అంటే అడవి అని అర్థం. అడవిలోపల కందమూలాలు తవ్వుకుంటూ బతుకు సాగించినా మంచిదే అని అర్థం.చాటు సంప్రదాయంలో ఇక్కడ జరిగిన మరో గమ్మత్తు, ఈ పద్యం పోతనగారిదని ప్రచారంలోకి రావడం. పోతనగారు నరునికి తన కావ్యాన్ని అంకితమివ్వనన్న విషయం ప్రసిద్ధమే. పోతన రైతు జీవితం గడిపాడన్న విషయం కూడా ప్రచారంలో ఉన్నదే. అంచేత ఊహశాలులెవరో, ఇందులో కూళలు అంటే మూఢులైన మనుషులు అని అర్థం చెప్పి దీన్ని పోతనగారికి అంటగట్టారు. పైగా "హాలికులైననేమి" అని ప్రతిజ్ఞ చేసి రైతుగా జీవితాన్ని కొనసాగించాడని అన్నారు. భలేగా ముడిపెట్టారు కదా! అన్నీ చక్కగా అమరిపోయాయి! అంచేత అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.ఇదీ ఈ పద్యం కథ. ఏది ఏమైనా ఈ పద్యం పోతన నోటినుండి వచ్చిందని ఊహించుకోడమే తెలుగువాళ్ళకి ఇష్టం. ఈ పద్యం చదివినప్పుడల్లా మనకి పోతనే గుర్తుకువస్తాడు. అంచేత ఇది పోతన పద్యమే!

No comments: