కవిత్వ విమర్శ కంటే కథా సాహిత్య విమర్శ సమకాలీన యుగంలో విస్తృతంగా వస్తున్నది. కథను గురించి లోతైన విశ్లేషణలు, ఆలోచనలు విరివిగా వస్తున్నాయి. ఒక సంవత్సర కాలంలో వెయ్యి కథలు వస్తే సుమారు పది పదిహేను కథా విమర్శన పుస్తకాలు, విరివిగా వ్యాసాలు వస్తున్నాయి. సమాజంలోని వ్యక్తులు ఆవేశాంతరంగం కంటే ఆలోచనాంతరంగం వైపు ఈనాడు దృష్టి సారిస్తున్నారు. అందువల్ల ఆవేశ, ఉద్వేగ, అనుభూతి చైతన్యమైన కవిత్వం కంటే ఆలోచనా చైతన్యమైన కథ ఎక్కువ ఆకర్షిస్తున్నది. అది సాహిత్య విమర్శలో కూడా ప్రతిబింబిస్తున్నదన్న విషయం ఇటీవలి కధా సాహిత్య విమర్శను చూసినప్పుడు స్పష్టమవుతున్నది. అలా గత పది పదకొండు సంవత్సరాలుగా కథాసాహిత్యాన్ని లోచూపు తో అవలోకిస్తూ వస్తున్న విమర్శకుడు కె.పి అశోక్ కుమార్. సమీక్షకునిగా నిరంతరం సాహిత్య పత్రకలలొ విహరిస్తున్న కె.పి అశోక్ కుమార్ కథావలోకనం తో కథా సాహిత్య విమర్శ రంగానికి దోహదం చేస్తున్నారు. ఈ రచన సమకాలీన కథా విమర్శకు నిలువటద్దంగా కనిపిస్తుంది.
మొత్తం ఇరవై మూడు వ్యాసాలున్న ఈ పుస్తకంలో పది సమీక్షలు కాగా, మిగిలినవి కథా సాహిత్యంలోని వివిధ పార్శ్యాలను, ధోరణులను కథకుల విశిష్టతను తెలిపేది. ఈ పుస్తకానికి కె.కె.ఆర్ పీఠిక వ్రాస్తూ అశోక్ కుమార్ ది మౌఖిక శైలి అనడం సబబే అనిపిస్తుంది. వ్యాసాన్ని మనకెదురుగా నిలబడి మాట్లాడుతున్నట్లు రాయడం కె.పి వ్యాస రచనా శైలిగా చెప్పవచ్చు. హాలీవుడ్ చిత్రాల సమీక్షల్లో చిత్రం చూడనివారికి కథ చెప్పాల్సినస్థితి ఉంటుంది. ఆ శైలి ఈ విమర్శ వ్యాసాల్లోకి చేరంది. కె.పి అశోక కుమార్ శైలిలో మౌఖికతకు కారణం పాఠకునిగా తనకు ఒక కథ కలిగించిన అనుభవాన్ని తనలో రేకెత్తించిన ఆలోచనలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వలన వచ్చిందనిపిస్తుంది. ఇది పాఠక ప్రతిక్రియ విమర్శకు దగ్గరగా ఉంటుంది. ఈ శైలిని అల్లం రాజయ్య చెమట చుక్క కలలు రెండు కథలు వంటి వ్యాసాల్లో ప్రత్యక్షంగా చూడవచ్చు.
సమకాలీనకథ వస్తు, రూప పరిణామం, తెలుగుకథా సాహిత్యంలో హిందూ ముస్లిం సమైక్యత ధోరణులు, తెలుగు కథల్లో చైతన్య స్రవంతి వ్యాసాలు పరిశోధనాత్మక కలిగిన విమర్శన వ్యాసాలు. 1991 లోవచ్చిన కథలను నేపధ్యంగా చేసుకుని విశ్లేషించిన ఈ వ్యాసంలో సమకాలీన వస్తు పరిణామంలో ఆనాడు వస్తున్న కథలను పదకొండు రకాలుగా విభజించారు. ఈ వ్యాసంలో నామిని సుబ్రమణ్యం నాయుడు కథలను గురించి చెప్పిన విషయం కె.పి నిశిత దృష్టికి నిదర్శనం (పు.28) బాల్య, కౌమార, యవ్వన దశలను ప్రతిబింబిస్తూ పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కథలు మిట్టూరోడి కథలు వచ్చాయని చెప్పడం మంచి విశ్లేషణ. ఈ కాలంలో రూపంలో స్కెచ్, చిన్నకథ, కార్డు కథ, పేజీ కథ, కాలమ్ దాటని కథల వంటివి వచ్చినా అవి స్పేస్ ఫిల్లర్స్ గానే ఉన్నాయని భావించారు. తెలుగు కథల్లో చైతన్య స్రవంతితోని చర్చించిన వ్యాసంలో శ్రీశ్రీ చైతన్య స్రవంతి ధోరణిలో వ్రాసిన తొలికథకుడిగా కె.పి.భావించారు . శ్రీ శ్రీ అబ్సర్డ్ కథాకథన పద్ధతిని చైతన్య స్రవంతిని కొనసాగించాడన్నారు గానీ అంటే ఏమిటో చెప్పలేదు. త్రిపుర కథల్లో భగవంతంకోసం, రాబందులరెక్కల చప్పుడు ,సఫర్ కథలను చైతన్య స్రవంతిని చెబుతూ “ఈ మూడు కథల్లో చైతన్య స్రవంతి ధోరణిని డిఫరెంట్ గా ఉపయోగించుకోవడం అన్నారు (పు.78) ఆ డిఫరెంట్ ఏమిటో చెప్పలేదు. జ్వరం మీద కవిత్వం వచ్చినట్లుగానే ‘కథకుని జ్వరం’పేరుతో పి.యస్. శాస్త్రి రచించిన కథను పేర్కొన్నారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య’ రానున్న శిఖరం ‘ చైతన్య స్రవంతి కథకాదన్నారు. అయితే చైతన్యస్రవంతి కథేమో అన్న భ్రమ కలిగించే కథకు నిజమని చైతన్య స్రవంతి కథకు మధ్య ఉన్న విభజన రేఖ గురించి చెప్పి ఉంటే బాగుండేది. ఈ వ్యాసంలో శ్రీశ్రీ తో అధివాస్తవికత , బైరాగిలో ప్రతీకవాదం ఆర్ .యస్. సుదర్శనంలో అస్తిత్వవాదం, నవీన్ లో శిల్పంలో కనిపిస్తాయని ప్రతిపాదించారు. తెలుగు కథాసాహిత్యంలో హిందూ ముస్లిం సమైక్యతా ధోరణులన్న వ్యాసంలో ప్రజాస్వామ్య లౌకిక భావనలను తెలిపే కథలను విశ్లేషించారు.
కథకుడుగా బైరాగి, కథకునిగా కాళన్నలను విశ్లేషించే వ్యాసల్లో కవులుగా ప్రసిధ్ధులైన ఈ ఇద్దరి కథలను విమర్శించారు. కథకునిగా వైరాగి వ్యాసంలో బైరాగి రాసిన కథల్లో ఆయన జీవితం ఉందని భావించారు. ఆయన కథలలో ఉన్న హీరో, వారు కోరుకునే ఒంటరితనం, భావుకత నిర్లిప్తత అన్నీ బైరాగివే (పు.10) అనడం ద్వారా ఆయన కథలు ఆత్మ కథనాత్మకం మన్న స్ఫురణ కనిపిస్తుంది.కాళోజీ కథలను గురించిన వ్యాసంలో కాళోజీ కథలు పతనమైపోతున్న రాజకీయ వ్యవస్థను ఎండగడతాయనీ, అవకాశవాదాన్ని విమర్శిస్తాయనీ, 1940-50 నాటి సామాజిక రాజకీయ స్థితులను ప్రతిబింబిస్తూ తెలంగాణ నేటివిటీ తో కూడుకొని ఉన్నాయని భావించారు.
కె.పి.అశోక కుమార్ తన వ్యాసాలలో వ్రాస్తున్న విషయాన్ని బట్టీ ప్రాంతీయ అస్తిత్వ ముద్ర ఉన్న విమర్శకుడిగా కనిపించడు కానీ ఆయన వాసిన 23 వ్యాసాలలో సుమారు 16 వరకు తెలంగాణా కథకుల కథలనే చర్చించింది. శ్రీశ్రీ కథల్లో చైతన్య స్రవంతి ధోరణులు వ్యాసంలో అబ్సర్డిటీ, సర్రియలిజం లక్షణాలుంటాయని భావించారు. అల్లం శేషగిరి రావు అడివి విస్తృతమైనదీ భయంకరమైనదీ ( పు.13) అంటూ ఇద్దరు రచయితలు ఒక అంశం మీద రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ తులనాత్మక వివేచన చేసారు కె.పి ఇది చాలా చోట్ల ఈ సంపుటిలో విషయాన్ని గుర్తు చేస్తూ తులనాత్మక వివేచనలో ప్రభావాన్ని గుర్తించడం కూడా ఒక భాగం “కథకుని జ్వరం రాసిన శాస్త్రి గారిపై బుచ్చిబాబు ప్రభావం, నరకంలో నలభై ఐదు నిమిషాలు రాసిన రామకృష్ణారావు గారిపై నవీన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది”_ (పు.81) వంటి విశ్లేషణ కె.పి నిశితదృష్టిని సూచిస్తాయి. గూడూరు సీతారాం గల్పికలపై చలం , ధనికొండ హనుమంతరావు, రావూరి భరద్వాజ ల ముద్రను గుర్తించడం (పు.89) ఆడెపుల లక్ష్మీపతి అశ్యాపదేశం కథ వ్యాసంగా మొదలై కథగా మారుతుంది ఇది లాటిన్ అమెరికన్ కథకుడు బోర్గ్స్ పద్ధతి వంటి వాటిని గుర్తించడం (పు.49) వంటివి కె.పి తులనాత్మక దృష్టి సంకేతాలు ఇటువంటిదే కలలు – రెండు కథలు వ్యాసం.
ఆడెపు లక్ష్మీపతి గురించి వ్రాసిన వ్యాసం కె.పి. విశ్లేషణాత్మక దృష్టికి సంకేతంగా నిలుస్తుంది. ఆడెపు లక్ష్మీపతి కథల్లో దృశ్యకథనపద్ధతి నాటకీయ పద్ధతి , స్వీయ సంబోధనాత్మక కథనం , వంటి కథన పద్ధతులున్నట్లు కె.పి భావించారు. సీతాదేవి , అల్లంరాజయ్య ,కాలువమల్లయ్య, గీతాంజలి సలీం,పెద్దింటి అశోక్ కుమార్ , జూకంటి జగన్నాధం వంటి కథకులపై వ్రాసిన వ్యాసాలలో మౌలికమైన వివేచన కనిపిస్తుంది.
కథానిక వాస్తవికత దగ్గరగా ఉండాలనీ, వాస్తవజీవితాన్ని ప్రతిఫలించాలనీ కె.పి. అభిప్రాయంగా కనిపిస్తుంది.అందుకే ఆయన ఈ పుస్తకంలోని చాలా వ్యాసాలలో’ అతి నాటకీయత’ను , వాస్తవికతను డాక్యుమెంటరీ పద్ధతిలో కథను నిర్వహించడాన్ని నిరసించారు. ఇదే విధంగా కొన్ని ప్రతిపాదనలు కూడా కనిపిస్తాయి. ఫోటోగ్రఫీ నేపధ్యంగా వస్తువుగా వచ్చిన తెలుగుకథగా దీన్ని (నిశ్చలన చిత్రం) చెప్పుకో వచ్చు (పు . 44)” నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన చైతన్య స్రవంతి కథలలోకెల్ల శిల్పపరంగా ఆంగ్లంతో దీటుగా నిలబడగలిగింది ఒక్క బుచ్చిబాబుగారి కథే (పు 78) వంటివి కనిపిస్తాయి.కథలను గురించిన వ్యాసాలలో కొన్ని చోట్ల నేపధ్య వివరణ ఎక్కువుగానే చేసారు కె.పి. కథల్లో హిందూ ముస్లిముల సమైక్యత ధోరణుల గురించిన వ్యాసంలో మొదట రెండు పేజీలు నేపధ్యమే ఉంది. ఇదే పద్ధతి మరో రెండు మూడు వ్యాసాల్లో ఉంది. బహుశా దీనికి కారణం ఆయన కె.కె.ఆర్ నడిపిన సారస్వత వేదిక, సమాంతరల నుంచీ ఆలోచనలను విస్తృతి చేసుకున్న వారు కావడమేమో ? అనిపిస్తుంది. ఈ పుస్తకంలోని చివరి వ్యాసం రచయితలు ఇలా కూడా ఉంటారా ? లో టి. శ్రీరంగస్వామి కథల సమీక్ష చేస్తూ రచయితల వ్యక్తిగత జీవితాలను గురించి తన అభిప్రాయాలను చెప్పారు. నిజానికి రచయితకు ప్రాధాన్యమివ్వడం ఆధునిక పద్ధతి. సాహిత్యానికి రచయిత ప్రధానం కాదు. రచన ప్రధానం. రచన ఇచ్చే అనుభవం అనుభూతి, అది చెప్పే తత్వం ప్రధానమని గుర్తించినప్పుడు ఈ భ్రమలకు ఆస్కారం ఉండదు. అయితే రచయిత మరో పార్శాన్ని ఈ రచయిత మరో పార్శాన్ని ఈ కథలు వ్యక్తం చేస్తామనడంలో సందేహం లేదు.
గత పది పదిహేనేళ్ళుగా కథా సాహిత్యాన్ని లోతుగా పరిశీలిస్తున్న కె.పి.అశోక్ కుమార్ ‘కథావలోకనం’ చేశారనడం కంటే కథానుశీలనం చేశారనడం సబబనిపిస్తుంది. గత యాబై సంవత్సరాలలో తెలుగుకథ పోయిన పోకడలను తెలుసుకోవాలనుకున్న వారికి ఈ ‘కథావలోకనం’ తప్పక చదవవలసినస్న పుస్తకం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment