Tuesday, September 4, 2007

మౌనం మాట్లాడుతోంది...

మౌనం మాట్లాడుతోంది
మానవత్వం మట్టికలిసినపుడు
మనిషితో మనిషి కరచాలనం
గతకాలపు వైభవం మాత్రమే!



రెండు రక్తపు చుక్కలు
చిందించి ఎంతమంది
నల్లవాళ్ళు వారి శరీరాన్ని
కళేబరాల్ని చేసుకున్నారో!



నా అస్తిత్వం మాయమై
ఆకాశం వరకు చిమ్మిన
చెమట చుక్కలు
ఇపుడు వర్షమై మీ దాహాన్ని
తీర్చుతున్నాయి!


చిన్నప్పుడు చెప్పిన
చందమామ కథ
పగిలిన గాజు పెంకుల్లా
చెల్ల చెదురుగ పడిన శకలాల్ల
తోస్తున్నాయి!


చరిత్ర ఎప్పుడు పునరావృతం
అవుతుంది
ఒంటరి సమూహంలో ఉన్నప్పుడు
రాత్రిల్లో పేలిన బాంబుల శబ్దాల్లా!


అనుమానపు చూపులతో
దేహాలను ఎక్సెరే తీస్తున్నారు
రక్త మాంసాలతో పాటు కాసింత
మానవత్వపు రేఖలు అస్పష్టంగా
కనిపిస్తున్నాయి!


ఆకాశమే హద్దుగా
కంఠమెత్తి విలపిస్తున్నా
మారణ హోమానికి వ్యతిరేకంగా!


చివ్వున చిందిన నెత్తురు మరకల
సాక్షిగా మీ నీత్తురు వృధాపోదని
అభయ హస్తం ఇస్తున్నా!

No comments: