Saturday, September 1, 2007

ష్...ష్...ష్...

ష్...ష్...ష్...


శబ్దం చేయకండి
చెవులు చిల్లులు
పడుతూ నిజాలు
వినబడడం లేదు!


కనులు గోడకి
వేలాడ దీసి
మాటలని మట్టిలో
కప్పిపెట్టాను!


ఏమిటి ఈ విచిత్రం
నా శరీరం భూమిలో
కూరుకుపోతున్నది!


చిత్రం!నా కాళ్ళు
ఇప్పుడు ఆకాశం
వంకా ఎగిరిపోతున్నాయి!


నా మనసు కనపడడం లేదు
ఎక్కడో ఆగాధ లోకంలో
తప్పిపోయింది!


రెప్పల పాటు స్వప్నం
మెలకువతో జారుకుంది
ఇప్పుడు మిగిలింది కేవలం
రెండు కన్నీటి చుక్కలు మాత్రమే!


నగరం సవతి తల్లి
కన్నతల్లిలా గుండెకు
అదుముకోదు సరికదా
నా వేశబాషలను చూసి
చీదరించుకుంటుంది!


ఆకాశం తలకిందులైంది
భూమి వెక్కి వెక్కి
ఏడుస్తున్నది!


నేను చదివిన మహా గ్రంధాలు
బ్రతకడానికి ఏమాత్రం
చిట్కాలు చెప్పలేదు!


మనిషి బ్రతుకు వందెళ్ళు
జీవించడానికి సరిపోదా
ఒక క్షణం!


మానవ సంబందాలన్ని
ఆర్తిక సంబంధాలు అయినప్పుడు
కేవలం పచ్చని కాగితానికి ఉన్న
విలువ మనిషికి లేకుండ పోయింది!

No comments: