Showing posts with label తెలంగాణ. Show all posts
Showing posts with label తెలంగాణ. Show all posts

Wednesday, March 5, 2008

తెలంగాణ బతుకులకు"మూలకం"

తెలంగాణ బతుకులకు"మూలకం" రెండో భాగం

హరగోపాల్ కవిత్వానికి మనిషే ప్రాణస్పందన.తను చేరుకునేసరికే మనిషి గాయమై వున్నాడు.మనిషి అనుభవాలు తను.ఎక్కడో తప్పిపోయిన ఆత్మీయాన్ని ఎక్కడో దొరకబుచ్చుకున్న ఆనందం.పెద్ద చిన్న శరీరానికే.హృదయానికి కావు.అదే కవి.వయసు మరిచి వ్యక్తీకరిస్తాడు.
"బురదలో ఆడుకొంటున్న పసివానిలా నేను నీలో పిచ్చుక గూట్లోకి నీ పాదం కోసం గుండెల గుంపుల్లో వెతుకులాట వొల్లంత పుసుకున్న ఇసుకలా గ్నాపకాలు"
బాల్యాన్ని తడిగుర్తుగా దాచుకొని ఇప్పటికి బాలుడు కాగలిగిన వాళ్ళకే ఈ వ్యక్తీకరణ అందుతుంది.
ఆకలి తెలిసిన కవి.అమ్మనెరిగిన కవి.ఆకాశమంత పందిరి అంటామే దాన్ని మించిన అద్బుత భావన చెసినాడు.
"భూగోళాన్ని అరచేతిలో వొత్తి రొట్టెలా కాల్చి బిడ్డలకడుపునింపే తల్లీ నువ్వు అమ్మవే "
హరగోపాల్ గొప్పభావుకుడు.అతని భావనలకు పై పద చిత్రం మంచి సాక్ష్యం.అంతేకాదు భావదారిద్ర్యాన్ని కూడ బలంగా ఎత్తిచూపినాడు.మాటల చమత్కారం మాత్రమే కాడు.ఒక ఎడతెగని చింతనవుంది. "దారిద్ర్యారేఖ దిగువ కన్నా కొట్లాది జనం భావదారిద్ర్యరేఖ దిగువనే ఎక్కువ"అంటాడు. పగిలిన అద్దం చుట్టు ఎంతజీవితం అందుకోవచ్చునో "చిరిగిన ఉత్తరం"చుట్టు అన్ని గ్నాపకాల్ని ఏరుకోవచ్చు.
"కొలిమి కొలిమిగానే వుంది కష్టం బూడిదకుప్పలెక్కనే వుంది కల్లంలో కొంగుసాపిన చేటెడుబిచ్చం లెక్కనె వుంది"
వర్గసమాజ దృష్టి హరగోపాల్ ప్రతి అక్షరంలో కనిపిస్తది.చేతికి ముద్దలేని చేతివృత్తులు,బరకతులేని రెక్కల కష్టం ఎంతయాతన పెడుతున్నాయో చిత్రించినాడు.కొలిమి అంటె బతుకు కొలిమి మండుతనే ఉంటది. బతుకు కాఠిన్యాన్ని మాటలతో ముట్టుకునే ప్రయత్నం చేసిండు కవి.
ప్రపంచీకరణ మాయజాలం మనిషిని ఆవరిస్తున్నది. ఇప్పుడుమనిషిని పోల్చుకోవడమే కష్టం. ఇగ మనిషిని చేరుకోవాలంటే మాములు కష్టం కాడు.ఊరు దయ్యం పట్టినట్టు మూలుగుతున్నది.
"ఉయ్యాలకట్టిన అమ్మకొంగుతో సహా వేపచెట్టు మాయం ఒరందిగిన అమ్మపొలంల దిగవడ్డది నాట్లులేవు కోతల్లేవు భూమిపుండువడ్డది"
కవి ప్రపంచాన్ని మనసునిండా పట్టించుకుంటాడు.నిజాలు చూసి నిజాలు రాసి నిండు జీవితాలిచ్చిన చరిత్రకర్తలు కవికి దగ్గరివాళ్ళు.అందుకే కవిత్వంలో వస్తువులు అయ్యారు.
"వాడు ప్రపంచాన్ని పట్టించుకోవడం షురూచేయగానే వాణ్ణి చూడటానికి భయమేసింది వాడు నేలవిడిచి కత్తుల వంతెన కడ్తున్నప్పుడే అనుకున్నా వాడింక దక్కుతదో లేడోనని"
అక్షరాలు నమ్ముకున్నవాళ్ళు,కాలాన్ని ఎదిరించిన వాళ్ళు కవి అభిమానాన్ని పొందారు. క్రూరసామ్రాజ్యం చేసే కుట్రల్ని కవి వ్యంగ్యంగా చెప్పినాడు. నిజాలు రాసినందుకు ఎన్ కౌంటరైన రసూల్ ను కవి మర్చిపోలేదు.అతని లాంటి ఎందరో తెలంగాణ జీవన చిత్రణ ఇది.
"బుగులు జరమొచ్చినట్లుంది తెలంగాణలో ఇప్పుడు గూడ రజకార్ల గుర్రాలదండ్లే తిరుగుతున్నట్లుంది పెరిగిపోయిన తల్లిపుసెల్ని పిల్లలేరుతున్నరు"
ఎన్నో ఏండ్లుగా తెలంగాణది విషాదచిత్రం.వీరచరిత్రం. నెత్తురు మడుగులైపారినా శాంతిరాలేదు.బతికిన చచ్చినా పల్లే బుగులు బుగులే.
"నివద్దె నువ్ జెప్పింది నిజం ఈడ బతుకులు నిమ్మలంగ లేవు ఈడ సావులు సాపుగ రావు ఈదంతా అడ్విల అగ్గిబడ్డట్టే"
తెలంగాణల సహజమరణాలు లేక చాల రోజులైంది.హత్యలైనా ఆత్మహత్యలైనా ఎన్ కౌంటర్లయినా ఏవి సహజమరణాలు కానేకావు.
ఒక్కమాటలో "మూలకం" సంభాషించని అంశమంటూ, ఈ కవిత్వ సంపుటిలో లేదు. మనిషి తన స్వప్నమని ప్రకటిస్తూ వస్తున్న కవి హరగోపాల్ కవిత్వం విషయంలో మరి ఇంత పిసినారితనం పనికిరాదు. మొత్తానికి హరగోపాల్ కవితలు తెలాంగాణ కవిత్వానికి,తెలాంగాణ బతుకులకు "మూలకం".మూలకం అంటే తెలాంగాణలో కారణం అని అర్థం.

Friday, February 15, 2008

తెలంగాణ బతుకులకు"మూలకం"

తెలంగాణ బతుకులకు"మూలకం"




హృదయాన్ని స్పందింపచేసే కవులు కొందరే ఉంటారు.వారిలో కొందరు మాత్రమే ప్రత్యేక భావజాలంతో,నూతన అభివ్యక్తితో కవిత్వాన్ని రాస్తారు.వారు మనుషులను జాగృతం చేస్తారు. వారి లక్ష్యం సమ సమాజ నిర్మాణం.విశ్వమానవ కళ్యాణం.ఈ రకం కవులలో చెప్పవలసిన కవి ఎస్.హరగోపాల్.నిశితమైన చూపు,పదునైన భావజాలం ఉన్నవాడు.
హరగొపాల్ కవిత సంకలనం "మూలకం" ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకువెలుతుంది.మనిషి తన స్వప్నమని ప్రకటిస్తూ వస్తున్న కవి,ఆధునికుడు హరగోపాల్ .కవి అంటే గాయం గుండే.కవిత్వం అంటే గాయాల గొంతుక.హరగోపాల్ గుండే గాయాన్ని గురుతుపట్టిన కవి.ఈ కవి తన కవిత్వానికి మనిషిని కేంద్రబిందువుగా చేసుకున్నాడు.మనషే తన కల అంటున్నాడు.హరగోపాల్ పల్లెల మట్టి వాసన తెలిసిన వాడు.పల్లెలను కళ్ళార చూస్తున్నవాడు.
వట్టిపోయినా పల్లెలను,ఎడారిగా మారిపోతున్న పల్లెవిషాదాలను తెలంగాణ వలసలను,పొట్టచేత పట్టుకొని వలసవెళ్ళే నిత్య సన్నివేషాలను చిత్రిక పట్టాడు.
"ఊరికి తలుపులెక్కడి విప్పుడుచప్పుడు చేయడానికి?అంతా వలసేనాయే!దిగులుపరచుకుపోయిన దిబ్బెనాయే!కరువు మీద కరువు దెబ్బేనాయే!"
ఈ కవిత సంపుటిలో మొదటి కవిత "తలుపు చప్పుడు".మాట స్పర్ష కోసం ఎదురుచూసే మూగవేదనంతా ఆవిష్కృతమైంది ఈ కవితలో....."పాలిచ్చేయాల్లకు అమ్మొచ్చిన సంతోషంకాడ మల్లెపూలు ఒల్లో దాసుకున్నంత మురిపెం నువ్వొస్తె!!"
"నువ్వొచ్చి కండ్లముందర ఒక్కఒద్దన్న వుంటేనే నాకు నిమ్మళం"
"కుక్కపిల్లై నామనసు నిన్ను పసిగడ్తుదినాలు గడుపుతుంటుంది"
నువ్వొస్తవో.....రావో..... యుగళగీతం అను కవితలో కొత్తగా,పదునైన కత్తిలా సత్యాన్ని ఎలా ప్రతిపాదిస్తున్నాడో చూడండి.
"పాదాలు రెండు కుక్కపిల్లలుదారినెపుడు మరిచిపోవుమనసు ప్రవహించగానే విశ్వాసంగా గమ్యానికి చేరుస్తాయి"


Tuesday, January 22, 2008

తెలంగాణ సామాజిక సమస్యల చిత్రణ-ఎల్లమ్మ ఇతర కథలు

తెలంగాణ సామాజిక సమస్యల చిత్రణ-ఎల్లమ్మ ఇతర కథలు



పదేళ్ళ కాలంగా తెలంగాణ కథ విస్తరిస్తోంది.బహుముఖమైన జీవితాన్ని చిత్రిస్తోంది. తెలంగాణ ప్రజల జీవితమంతా ఒకే తీరున లేదు.ఎంతో వైవిద్యం ఉంది. 1990 కాలంలో ఆరంభమైన సరళీకృత ఆర్థిక విధనాలు ప్రభావం తెలంగాణాపై అధికంగా ఉంది.పట్టణాలకి,పల్లెలకి మద్యన అంతరాలు పెరిగాయి. ప్రపంచీకరణ ప్రభావాల పర్యావసానంగా ఏర్పడిన పరిణామాల చిత్రీకరణను చాలమంది కథకులు చిత్రించారు.పల్లె జీవితాల్లో వస్తున్న మర్పుల్ని తెలంగాణకి చెందిన వివిధ జిల్లల కథకులు చిత్రించారు.పల్లె జీవితం మునుపు ఉన్నట్టుగా లేదు.పల్లెల్లోకి డిష్ యాంటెన్నాలు వచ్చాయి.కూల్ డ్రింక్స్ ,వాటర్ బాటిల్స్ ఒక్కమాటలో చెప్పలంటే మార్కేట్ నిర్దేషించే సమస్త వస్తు సముదాయం పల్లెల్లో దొరుకుతుంది.ముఖ్యంగా కేబుల్ టీవి వచ్చి తెలంగాణ పల్లెల జీవితాన్ని ఎంతగా చిద్రం చేసిందో ఇప్పటి కథకులు చిత్రించారు.
తెలంగాణ ఆత్మను పట్టుకొన్నవారిలో కాసుల ప్రతాపరెడ్డి ఒకరు.ఈయన కథల సంపుటి "ఎల్లమ్మ ఇతర కథలు" చదివితే ఈ విషయం తెలుస్తుంది. ఒకే వ్యక్తి కథకుడిగా,కవిగా, విమర్శకుడిగా,జర్నలిస్టుగా తెలుగు సాహిత్యంలో రాణించడం అరుదైన విషయం.తెలంగాణ,కోస్తా భాషల వైరుధ్యాల్ని ఈ రచయిత చక్కగా ఆవిష్కరించారు. "ఎల్లమ్మ ఇతర కథలు" సంపుటిలో మొత్తం పదియేను కథలు ఉన్నాయి. వస్తువు రీత్యా ప్రతి కథ విభిన్నంగా ఉండి చదివించే శైలిలో ఉండడం గొప్ప విషయం.రచయిత కథ శిల్పం మనలను అనవసర వర్ణనల జోలికి పోకుండా ఏకంగా కథలోకి దిగుతాడు.కథకు సరిపడని వ్యర్తమైన పదం ఒక్కటి కూడ వాడకపోవడం రచయిత అక్షరాల పొదుపరి తనాన్ని చూచిస్తుంది.శైలి సులభంగా ఉండి ఎక్కడ ఇబ్బంది కలిగించదు. ప్రస్తుత తరంలో కాసుల ప్రతాప రెడ్డి అగ్రశ్రేణి కథ రచయిత అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.
సంపుటి లోని మొదటి కథ "శిథిలం" రైతుల ఆత్మహత్యల పరంపరను సహజంగా చిత్రించింది.తెలంగాణలో వ్యవసాయం ఎంత దారుణంగా తయారయిందో వివరిస్తాడు. కథలోని పాత్రతో ఇలా అనిపిస్తాడు "ఏంది నాయన!మా రైతులమంతా చచ్చిపోయినంక ఈ దేశం ఎట్లా వుంటుందంటావు? నోట్లు ముద్రించుకొని వాటిని నమిలి మింగుతార?ఇదిగో చూడు! ఈ రోడ్డు వేసిండ్రు.దీన్ని రొట్టె ముక్కల లెక్క కొరుక్కొని తింటామా?" అని రైతు అనడంలో ఎంతో తాత్వికత కనిపిస్తుంది.ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికి జరుగుతున్నాయి. పల్లెలు,వ్యవసాయం కనుమరుగవుతున్న దృశ్యాన్ని రచయిత శక్తిమంతంగా ఈ కథలో "ఫోటోగ్రాపిక్" గా చిత్రించాడు.
మాల,మాదిగల మద్య తేడాలు ఉన్నట్లే రెడ్లలో గల తేడాలను "పక్షులెరిగి పొయిన తోట" కథలో రచయిత మనకు తెలియజేస్తాడు. ఇది చదివి మనం విబ్రాంతి పొందుతాము రచయిత మాటల్లో చెప్పాలంటే "మాల మాదిగలను మా ఇళ్ళలోకి రానీయకపోవడం అనుభవంలోనిదే.కానీ కలిసి ఉంటూ కూడ ఇంత తేడా పాటించాలా? మేటాటి రెడ్లు,మేం పాకనాటి,మేనత్తవాళ్ళు గూడాటి రెడ్లు,రెడ్లలో ఎనిమిది రకాల రెడ్లు ఉన్నారు. వీరిమద్య కూడా అంటరానితనమేదో వున్నట్లు నాకనిపిస్తుంది" అంటూ రెడ్ల లో గల అంటరానితనాన్ని మనముందు వుంచుతాడు.
మరో మంచి కథ "బతుకు చిద్రం" ఇందులో రాజయ్య వరుసగా కురుస్తున్న వర్షానికి పొట్టగడవదు. అతని ఆటో రిక్షా నాలుగు రోజులుగా మూలన పడిఉంటుంది.తినడానికి తిండి ఉండదు.వర్షంలో ఎలాగైతేనేం బయటకు వస్తాడు కాని ఒక గిరాకి వచ్చే సూచనలు కూడ కనిపించడం లేదు.ఒక పక్క ఆకలిగా ఉంటుంది.బస్టాప్ కు చేరుకుంటాడు ఒకరిద్దరు వచ్చిన హళ్ళు హడవిడిగా ఆటో వంక చూడకుండానే వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలిస్ రోడ్డుకు అడ్డంగా ఆటో ఆపాడని లంచం అడుగుతాడు. అసలే నాలుగు రోజులుగా అన్నం మొహం చూడని రాజయ్య అతని మాటలకి కోపం వచ్చి ఆటో దహనం చేస్తాడు. ఇందులో సామన్యుని ఎదిరింపు,తెగింపు చూడవచ్చు.నిజానికి ఆటో దహనం చేయలన్నా కోరిక ఈ వ్యవస్థ మీద తిరుగుబాటుగా కనిపిస్తుంది.

"ఆప్టర్ ట్వంటి ఇయర్స్ అను మంచి మిత్రుల కథ" ఇద్దరు మిత్రులకు సంబదించిన కథ.శేఖర్ ఒక పోలిస్ ఆపిసర్ అతని మిత్రుడు ఒక జర్నలిస్ట్.శేఖర్ ను చూసి అనవసరంగా బయపడుతుంటాడు జర్నలిస్ట్ మిత్రుడు.ఈ కథ కొంత వరకు జర్నలిస్ట్ మిత్రుని మానసిక భయాలను తెలియచేస్తుంది.
రాములు ఒక యూనివర్సిటీలో డిపాట్మెంట్ హెడ్.ఇతనికి రమాదేవితో పరిచయం అవుతుంది.అప్పటి వరకు మంచి వాడిగా పేరున్న రాములు రమదేవి పరిచయం వల్ల వారికి కావలసిన వరికి ఉదారంగా ఫండ్స్ మంజూరు చేసి ఉద్యోగం పోగొట్టుకుంటాడు.అక్రమ సంబందాలు ఎంతటి విపత్కర పరిస్థిలకు దారితీస్తాయో "దగ్దం" కథ ద్వార తెలుసుకోవచ్చు.

కార్పోరేట్ కాలేజ్ ల హింసను,ర్యాంకుల పేరిట జరిగే ఒత్తడిని భరించలేక ఆత్మహత్య చేసుకొన్న ఇంటర్మీడియట్ విద్యార్థి కథను "హత్య" లో చదవవచ్చు.తల్లిదండ్రులు కేవలం ర్యాంకుల గురించి విపరీతమైన వత్తిడి తేవడం వలన, కొత్త ప్రదేశంలో చదవడం వలన,పిల్లలను కేవలం ర్యాంకులకే పరిమితం చేయడం వలన ఈ ఆత్మహత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

విద్యార్తి దశ నుండి కలిసి తిరిగిన విహహబంధం పవిత్రతను ప్రశాంత్ అర్థం చేసుకోలేకపోయాడు.అసూయతో అతడు తనలో తనే మథనపడటం వంటి సన్నివేశాలు "పెనుగులాట"కథలో చదవవచ్చు.పద్మజ లాంటి గృహిణులు కూడ బయట ఎన్ని బాధ్యతలు వున్న కుటుంబ వ్యవస్థను విస్మరించకూడదనే సత్యాన్ని చక్కగా చెప్పారు రచయిత.

ప్రేమికురాలి మితిమీరిన ఒత్తిడిని నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చి,భార్య దగ్గరకే వెళ్ళిపోయే కథానాయకుడిని ఎంతో సానుకూలంగా చిత్రించిన కథ "లవ్ 2020".

మానవ సంబంధాల్లో వుండాల్సిన గాఢతని వ్యక్తీకరించిన కథ "కొన్ని ప్రేమలు".నిరంతర తపనకి సంబధించిన వ్యవహరం ప్రేమ అని,బాద్యతను మోయడానికి కుదుర్చుకునే ఒప్పందం పెళ్ళి అని అనడం ద్వార రచయిత పెళ్ళి బోలుతనాన్ని చాటుతాడు.
సమాజంలో తరతరలుగా పాతుకుపోయిన మూడనమ్మకాలని గురించిన కథ "ఎల్లమ్మ"పెట్టుబడిదారి సమాజంలో పాత ప్యూడల్ సంబంధాలు ఇంకా మిగిలి ఉండటం వల్ల ఎంతో మంది ఈ మూడనమ్మకాలకు బలైపోవడం ఈనాటి సామాజిక దృశ్యం.బాలమ్మ తన చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం వల్ల ఏర్పడిన అభద్రతలోంచి,లైంగిక వాంచలు తీరని ఒకనొక మానసిక అసమత్యుల స్థితిలోకి వెళ్ళింది.అది ఎల్లమ్మ పూనకంగా తాను భ్రాంతి చెందింది.సమాజంలో వున్న మూడవిశ్వాసాలు ఇంకా ఈనాటి గ్రామీణ ప్రజల నిత్య అనుభవం లోనిదే.